Translate

27 డిసెంబర్, 2021

త్రినాథ వ్రత కథ

 త్రినాథ వ్రత కథ :

#####################################


శ్రీపురం అను గ్రామమున ఆయావరపు బ్రాహ్మణుడు కలడు. అతనికొక కుమారుడు కలిగెను. తల్లి వద్ద బిడ్డకు ఇచ్చేందుకు పాలు లేవు. ఆమె  తన  భర్తతో పాలు కోసం ఆవు లేనిదే పిల్లవాడిని   పెంచడం కష్టమని చెప్పింది. అప్పుడు ఆయన " నేను ధనవంతుడిని కాను, ఆవును నేనెట్లా సంపాదించగలను! భగవంతుడా!!" అని బాధపడి, ఏమి తోచక ఇంట్లో ఉన్న పాతను సామానును తీసుకెళ్లి అమ్మాడు; ఆ సామానుకు 5 రూపాయలు వచ్చాయి. ఆ 5 రూపాయలతో ఆవును కొనడానికని బయలుదేరాడు.

అలా బయలుదేరిన బ్రాహ్మణుడు ఒక గ్రామం చేరాడు; అప్పుడు అదే గ్రామంలోని ఒక షావుకారి తన పశువులలో ఒక ఆవు లంకమేత(చేలల్లోకి వెళ్లి మేయడం ) కు  అలవాటు పడినదైనందు వల్ల, ఇంటిమీదకు గొడవలు వస్తున్నాయి, అందుకని ఆ ఆవును అమ్మడానికి నిశ్చయించుకొని, తమ చేను తిన్నదని చెప్పవచ్చిన వారందరితో ఆ ఆవు 50 రూపాయల ఖరీదైనదయినా 5 రూపాయలకే అమ్మేస్తానని అందరికి చెపుతుండగా, ఈ బ్రాహ్మణుడు అది విని "ఓ షావుకారు ! ఆడిన మాట తప్పుకు, ఇవిగో 5 రూపాయలు తీసుకొని ఆ ఆవును ఇవ్వు ." అని అన్నాడు.ఆ షావుకారు ఆ ఆవు పీడవదులుతులనందుకు సంతోషించి, ఆ ఆవును, ఆ బ్రాహ్మణుడికి అమ్మేశాడు.

ఆ బ్రాహ్మణుడు ఆ ఆవును, దాని పెయ్యను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ ఆవు పాలతో బిడ్డను సాకుకుంటున్నారు. ఇలా కొన్ని రోజులు గడవగా, ఒక రోజు ఆ ఆవు వేళకి ఇంటికి రాలేదు. ఆ ఆవును వెతుకుతూ ఆ బ్రాహ్మణుడు అడవిలోకి  వెళ్లి ఎంతగా వెతికినను దొరకలేదు. ఇంక వెతకలేక, అలుపు తీర్చుకుందామని ఒక మర్రి చెట్టు కింద పడుకున్నాడు.

అదే చెట్టు మీద ముగ్గురు కూర్చొని ఉన్నారు.  వారు అతనిని పిలిచి ఎందులకు అతను ఆలా దిగులుగా ఉన్నాడో విచారించగా, అతను తన కథను మొత్తం చెప్పుకొచ్చి, ఇక అతను సంతకు వెళ్లి ఆ ఆవును వెతికెదనని చెప్పాడు. అప్పుడు ఆ ముగ్గరు ఆయనతో  " నీవెట్లాగో సంతకు వెళ్తున్నావు కదా, ఇదిగో ఈ ౩ పైసలు తీసుకొని, మాకోసం గంజాయి ఆకు, వక్క, నూనెలు తీసుకొని రా" అని చెప్పారు.

సరేనని బ్రాహ్మణుడు సంతలో తన ఆవును వెతుకగా, లాభం లేకపోయే . అంతట ఆ ముగ్గురి కోసం  రెండు పైసలతో గంజాయి ఆకు, వక్క తీసుకొని, మరో పైసాతో నూనెను కొనడానికని నూనెల అంగడికి వెళ్లగా అందులోని ఓక ముసలి వ్యాపారి, ఆ బ్రాహ్మణుడిని పిచ్చివాడిలా చూసి, నూనెను సరిగ్గా కొలవకుండా, తక్కువ నూనె ఇచ్చి పంపివేసాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోగానే, అతని వద్ద ఉన్న నూనె అంత మాయం అయినది. అందులకు ఆ ముసలి వ్యాపారి మూర్చపోయాడు, పక్క అంగడి వాళ్ళు అతనిని సేదతీర్చగ, అతను మేలుకొనిన తరువాత జరిగింది వాళ్ళతో చెప్పగా , వారు ఆ బ్రాహ్మణుడిని వెతుకుంటూ వెళ్లి,  " అయ్యా బ్రాహ్మణోత్తమా! మీకు ఇచ్చిన నూనె కొలతల్లో తప్పు జరిగింది, మీకు సరిగ్గా కొలిచి ఇచ్చెదమని" చెప్పి, తిరిగి అంగడికి తీసుకొని వెళ్లి, సరిగ్గా కొలువగా, పోయిన నూనె సంబారమంతా తిరిగి వచ్చింది.అప్పుడు ఆ ముసలి వ్యాపారి సంతోషించగా, ఆ బ్రాహ్మణుడు, తిరిగి ఆ ముగ్గురి వద్దకు ఆ సరుకులు తీసుకొని వచ్చినాడు.

అప్పుడు సంతసించిన త్రిమూర్తులు ," ఓ బ్రాహ్మణుడా! మేము త్రిమూర్తులము, నీవు చాల కష్టాలు పడుతున్నావు, నిష్టతో నీవు మా వ్రతము చేసిన యెడల నీ దరిద్ర బాధ తీరును." అని చెప్పగా, అందుకు ఆ బ్రాహ్మణుడు " స్వామీ చాలా పేదవాడను , వ్రతములెలా చేయగలను?" అని బదులిడగా, " ఓయీ! మా ఈ వ్రతము చేయడానికి ఎక్కువ ఖర్చు అవసరము లేదు. నీవు సంత నుండి మాకోసం తెచ్చిన సరుకులతో చేసిన నీ కష్టాలు తీరును." అని చెప్పి అదృశ్యులైరి .



 వెంటనే ఇంటికి వెళ్లి భార్యకు జరిగినదంతా చెప్పి, సంతనుండి తీసుకొని వచ్చిన సరుకులతో, పరమ నిష్ఠతో ఆ వ్రతమును ఆచరించగా, పోయిన ఆవు దూడలు తిరిగి వచ్చినవి. వారి బాధలు తీరిపోయి, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సుఖంగా ఉన్నారు.

################################################

ఈ వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు.ఒక ౩ సంవత్సరాలు చెయ్యాలి, ఈ వ్రతాన్ని, ౩ లేదా 5 రోజులు చేస్తారు.రావి ఆకులను కూడా దేవుని పటముల వెనకగా ఉంచుతారు. ౩ రోజులు చేసేట్టైతే ౩ కలశములు. లేదా 5 రోజులైతే 5 కలశములు ఉంచి పూజను చేస్తారు.

ఓపికతో చదివినందుకు ధన్యవాదాలు.

02 అక్టోబర్, 2021

సూర్య భగవానుడే స్వయంగా చెప్పిన " సూర్య స్తుతి "

 సూర్య భగవానుడే స్వయంగా చెప్పిన " సూర్య స్తుతి "

#########################################

ఈ క్రింది స్తోత్రమును సూర్య భగవానుడే స్వయముగా సాంబునికి ప్రవచించారు:


స్తోత్రం:    వైకర్తనో  వివస్వా౦శ్చ మార్తా౦డో  భాస్కరో రవిః |

                 లోకప్రకాశకః శ్రీమాన్  లోకచక్షుర్గహేశ్వరః  || 

                  లోకసాక్షేత్రిలోకేశః కర్తాహర్తా తమిస్రహా |

                   తపనస్తావనశ్చైవ శుచిః సప్తాశ్చ వాహన ||

                    గభస్తిహస్తో బ్రహ్మాచ సర్వదేవ నమస్కృతః |

ఫలశ్రుతి :  ఏకవింశతి రిత్యేషస్తవ  ఇష్టస్సదా మమ ||

                   శరీరారోగ్య దశ్చైవ ధనవృద్ధి యశస్కరః |

                  స్తవరాజ ఇతిఖ్యాత త్రిషులోకేషు విశ్రుతః ||

                 య ఏతతే మహాబాహో ! ద్వేసంధ్యేఽ స్థామనోదయే |

                 స్తౌతి మాంప్రణతో భూత్వా  సర్వపాపైః ప్రముచ్యతే ||

                 మానసం వాచికం వాపి కాయికం యచ్చదుష్క్రుతమే |

                 ఏకజాప్యేనతత్సర్వ౦  ప్రణశ్యతి మమాస్రతః ||

                 ఏషజాప్యశ్చ  హోమశ్చ సంధ్యోపాసనమేవ  చ |

               బలిమంత్రోఽర్ఘ్య  మంత్రో థ రూపమంత్రస్తథైవచ ||

               అన్నప్రదానే  స్నానేచ ప్రణిపాతే ప్రదక్షిణే |

                పూజతోఽ యం మహామంత్రః సర్వపాపహరః  శుభః ||

                                                                                (శ్లో || 1 - 12, అధ్యా - 128) 



సాంబా! సర్వ శుభప్రదమైనవి, నాకు అత్యంత ప్రీతికరమైనవి అయినటువంటి 21 నామాలు చెప్పెదను, జాగరూకుడవై ఆలకించు.

1. వైకర్తనుడు 

2. వివస్వంతుడు 

౩. మార్తా౦డుడు 

4. భాస్కరుడు 

5. రవి 

6. లోకప్రకాశకుడు 

7. శ్రీమంతుడు 

8. లోకచక్షువు 

9. గ్రహేశ్వరుడు 

10. లోకసాక్షి 

11. త్రిలోకేశుడు 

12. కర్త 

13. హర్త 

14. తమిస్రహుడు 

15. తపనుడు

16. తాపనుడు 

17. శుచి

18. సప్తాశ్వ వాహనుడు 

 19. గభస్తిహరుడు 

20. బ్రహ్మ 

21. సర్వదేవనమస్కృతుడు 

ఈ 21 నామాలతో కూడిన stస్తోత్రం నాకు ప్రీతిపాత్రమైనది. దీన్ని పఠిస్తే శరీరారోగ్యం, ధనవృద్ధి, కీర్తిప్రతిష్ఠలు పెంపొందుతాయి. ముల్లోకాల్లో ఇది గోప్పస్తవరజంగా పేర్కొనది. ఉదయ  అస్తమాన సంధ్యలలో ఈ స్తోత్ర౦తో ఎవరు నన్ను స్తుతిస్తారో !వారి పాపాలన్నీ నశిస్తాయి.

ఈ స్తోత్రమే - మంత్రజపం, హోమం, సంధ్యోపాసన, పూజామంత్రం, అర్ఘ్య మంత్రం, ధూప మంత్రం కూడా. అన్నం నివేదించేటప్పుడు నాకు అభిషేకం, అర్చన, ప్రదక్షిణ చేసేడప్పుడు ఈ స్తోత్ర మంత్రాన్నే పఠించాలి, ఎందుకంటే ఇది సకలపాపహర౦, శుభకరం అయిన స్తోత్రం కనుక అని ప్రబోధించాడు. 


ఇంతకు ఈ సాంబుడు ఎవరు?  సూర్య దేవుడే స్వయంగా ప్రవచించాల్సిన అవసరం ఏంటి అనే అనుమానం వచ్చిందా? అయితే ఆ కథ కమామిషు చెప్తాను చదవండి..

సాంబుడు స్వయానా శ్రీ కృష్ణ పరమాత్ముడికి - జాంబవతులకు కలిగిన సంతానం. రూపం తండ్రిదే అయినా బుద్ధులు ఆయనవి రాలేదు. చాల పాపాలు చేసేవాడు, ఎవరు మందలించిన లెక్కచేయలేదు. చివరకు ఒకసారి శ్రీ నారద మహర్షిని అవమానించడంతో, నారద మహర్షి సాంబుడిని భయంకరమైన కుష్ఠు వ్యాధితో బాధపడమని శపించారు. కుష్ఠు వ్యాధితో బాధపడుతూ,తన తండ్రి అయినా శ్రీ కృష్ణుడిని శరణు వేడగ, కృష్ణయ్య సాంబుడిని చేసిన తప్పుకు శిక్ష అనుభవించమని, ఇందులో అయన ఏ విధముగా సహాయము చేయబోనని చెప్పగా. 

అంతటా సాంబుడు పశ్చాత్తాపడి, తన రోగం నుండి విముక్తుడవ్వడానికి మార్గం వెతుకుతూ వారణాసి చేరాడు. అక్కడ సూర్య భగవానుడికి ఘోర తపస్సు చేసి, ఆ రోగము నుండి విముక్తి పొందాడు. అందుకు గుర్తుగా కాశీలో, సూరజ్ కుండ్ దెగ్గరలో "సాంబాదిత్యడు " పేర గుడి కట్టబడినది.

తనకు రోగం తగ్గిన తరువాత కూడా సూర్య భగవానుడిని ఆరాదించిస్తున్న సాంబుడి భక్తికి మెచ్చి, కలలో సాంబుడికి ఆ సూర్య భగవానుడే ఈ స్త్రోత్రాన్ని స్వయంగా ప్రవచించారు. 

23 సెప్టెంబర్, 2021

విగ్నేశ్వర పూజా విధానం



 గకారాక్షర స్వరూపుడైన విఘ్నేశ్వరుడి పూజ కి ప్రత్యేకంగా తిథి, నక్షత్రం,  ఉపవాస విధులు ఆచరించక్కర్లేదు.  ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ గణపతి విగ్రహాన్ని బట్టి ఫలితాలు మారుతుంటాయి. వివిధ రకాల పదార్థాలతో గణపతి ప్రతిమలు చేయవచ్చు అయితే ఒక్కో రకమైన ప్రతిమను ఒక్కో విధంగా పూజించాలి.


శ్వేతార్క(తెల్లజిల్లేడు) గణపతి :

గణపతికి చాలా ఇష్టమైన వృక్షం తెల్లజిల్లేడు.  అందుకే తెల్లజిల్లేడు వేరుని తెచ్చి దానితో బొటనవేలికణపు పరిమాణంలో గణపతి విగ్రహాన్ని చెక్కించాలి. 

 ఆ విగ్రహం ఎలా ఉండాలంటే పద్మాసనంలో కూర్చుని, నాలుగు భుజాలతో, మూడు కళ్లతో, ఆభరణాలు,  సర్ప యజ్ఞోపవీతం, తలమీద చంద్రరేఖ, ఎడమచేతిలో దంతం, కుడిచేతిలో జపమాల, మూడో చేతిలో గొడ్డలి, నాలుగు చేతిలో ఉండ్రాయిని ధరించినట్టు గా చెక్కించాలి.


                                                        *ఉదాహరణకు తీసుకొనబడిన చిత్రము.


పూజా విథి:
ఈ విధంగా చెక్కించిన గణపతి ప్రతిమని యధావిథిగా స్థాపించి సమాలంభం (అనగా కుంకుమ చందనం కలిపిన పొడి)తో, వస్త్ర భూషణాలు సమర్పించి, ఎర్రని పూలతో గణపతిని పూజించాలి. 

తరువాత సుగంధ భరిత ధూపాన్ని సమర్పించి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాలి. 

ఈ పూజ చేయటానికి ముందు విప్రుడికి భోజనం పెట్టాలి. 

ఆ బ్రాహ్మణుడు పొట్టిగా మరుగుజ్జువాడు గా ఉండాలి. అలాంటి విప్రుణ్ణి పూజించి అతని ఆశీర్వచనాన్ని తీసుకోవాలి.

పూజ మంత్రాలు:
శ్వేతార్క గణపతికి ఈ క్రింది మంత్రంతో పూజ చేయాలి గణపతి మూల మంత్రం- ఓం గం స్వాహా
ఓం గం నమః హృదయాయ నమః
ఓం గీం శిరసేస్వాహా
ఓం గూం శిఖాయైవషట్
ఓం గైం కవచాయహుం
ఓం గౌం నేత్రత్రయాయై వౌషట్
ఓం గః అస్త్రాయఫట్
అని హృదయన్యాసం చేయాలి.

ఓం ఆ గా ఉల్లాస స్వాహా అని గణపతిని ఆహ్వానించాలి.
ఓం గం గణేశాయనమః అని గంధాన్ని సమర్పించాలి.
ఓం గం పుష్పోల్కాయనమః అని పుష్పాలను సమర్పించాలి.
ఓం గం ధూపోల్కాయ నమః అని ధూపాన్ని సమర్పించాలి.
ఓం గం దీపోల్కాయ నమః అని దీపాన్ని సమర్పించాలి.
ఓం గం మహోల్కాయ నమః అని నైవేద్యం సమర్పించాలి.
ఓం సంసిద్ధోల్కాయ నమః అని గణపతికి ఉద్వాసన చెప్పాలి.


హోమ విధి:

ఈ విధంగా శ్వేతార్క గణపతిని పూజించిన తరువాత ఈ క్రింది విధంగా మంత్రాలు చెబుతూ హోమం చేయ్యాలి.
ముందుగా హోమకుండాల్ని ఏర్పాటు చేసుకొని అందులో తూర్పు దిశలో "ఓం మహా కర్ణాయవిద్మహే వక్రతుండాయ ధీమహితన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా" అనే మంత్రాన్ని పఠించి ఆహుతిని సమర్పించాలి.
"ఓం మహా గణపతయే స్వాహా" అని పఠిస్తూ దక్షిణ దిశలో, "ఓం మహోల్కాయ స్వాహా" అని పడమర దిశలో, "ఓం కూశ్మాండాయ స్వాహా" అని ఉత్తరదిశలో, "ఓం ఏకదంత త్రిపురాయ స్వాహా" అని ఆగ్నేయ దిశలో, "ఓం శివదత్త వికటహర హాస ప్రాణాయస్వాహా" అని చెబుతూ నైరుతి దిక్కులో, "ఓం తులంబనాత్యచల దంతాయ స్వాహా" అని వాయవ్య దిక్కున, "ఓం పద్మ దంష్ర్టాయవరాయ స్వాహా" అని ఈశాన్య దిశలో హోమం చెయ్యాలి.

జపం హోమ - ఫలితాలు:

1.పై తెలిపిన శ్వేతార్క గణపతి హోమాన్ని నువ్వులతో ఎనిమిది వేల సార్లు చేస్తే మూడు రాత్రులు రాజు వశమవుతాడు.
2. తిలలు, యవలు కలిపి హోమం చేస్తే జానపదులంతా వశ్యమవుతారు. సకలజన వశీకరణ శక్తి లభిస్తుంది.
3. శనగలు బియ్యంతో హోమం చేస్తే దుర్జయుడవుతాడు.
4. వివిధ రకాల నూనెలతో హోమం చేస్తే విద్వేషణ ఫలిస్తుంది .
5. చంద్రగ్రహణ సమయంలో మూలమంత్రాన్ని నీళ్ళలో నిలబడి చేస్తే యుద్ధంలో విజయం లభిస్తుంది.
6.సూర్యగ్రహణం నాడు సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఎనిమిదివేల జపం చేస్తే సూర్యానుగ్రహం కలుగుతుంది.
7. శుక్లపక్ష చతుర్థి రోజు ఉపవాసం ఉండి గణపతిని పూజించి నువ్వులు, బియ్యంతో హోమ్ చేయాలి. తర్వాత హోమభస్మాన్ని ధరించాలి. అలా చేస్తే శత్రు పరాజయం కలుగుతుంది.
"ఓం గం స్వాహా" అనే ఈ గణపతి మూల మంత్రం తక్కువ సంఖ్యలో (కనీసం 40,000 లేదా నాలుగు వేలు) జపించినా సిద్ధిస్తుంది. ముందుగా ఈ మంత్రాన్ని పై తెలిపిన సంఖ్యలో జరిపించి ఆ తరువాత హోమం చేసేటప్పుడు:
1.  ఓం వక్రతుండాయ స్వాహా
2.  ఓం ఏకదంష్ర్టాయ స్వాహా
3.  ఓం కృత కృష్ణాయ స్వాహా
4.  ఓం గజకర్ణాయ స్వాహా
5.  ఓం లంబోదరాయ స్వాహా
6.  ఓం వికటాయ స్వాహా
7.  ఓం ధూమ్రవర్ణాయ స్వాహా
8.  ఓం గగనకుజాయ స్వాహా
9.  ఓం వినాయకాయ స్వాహా
10. ఓం గణపతయే స్వాహా
11. ఓం హస్తిముఖాయ స్వాహా
అనే 11 మంత్రాలతో ఆహుతుల్ని సమర్పించాలి. ఈ విధంగా శ్రద్ధాభక్తులతో గణపతి పూజని,జప హోమాల్ని నిర్వర్తించిన వాడికి అసాధ్యమైన కార్యమేది ఉండదు. ఈ పూజని అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చు.



*ఇక్కడ పొందుపరచిన విషయాలు పుస్తకాలనుండి తీసుకోబడినవి. నా సొంతం కాదు. ఆ మూఢ విశ్వాసాలను ప్రోత్సహించడం మా ఉద్దేసం కాదు.









త్రినాథ వ్రత కథ

 త్రినాథ వ్రత కథ : ##################################### శ్రీపురం అను గ్రామమున ఆయావరపు బ్రాహ్మణుడు కలడు. అతనికొక కుమారుడు కలిగెను. తల్లి వ...